
కొత్తూరు ఆలయ పరిసరాలలో ఒక యజ్ఞవాటిక, పెక్కు మట్టి పాత్రలు లభించాయని, వీటిని పరిశీలిస్తే అక్కడ ఎప్పుడో మునులు యాగాలు చేసి ఉండవచ్చని తెలుస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలోని సర్పరూప విగ్రహం స్వయంభువు. ఇక్కడ నాగుల చవితి, నాగపంచమి, సుబ్రమణ్యషష్ఠి ఎంతో వేడుకగా జరుగుతాయి. ఆలయం ఉన్నచోట లభ్యమైన విగ్రహం 12 తలలు కలిగిన సర్పాకార సుబ్రమణ్యస్వామి. ఈ 12 తలలు 12 నెలలకు, 12 రాశులకు ప్రతీక అని చెబుతారు. ఆలయంలో పార్వతి నాగమల్లీశ్వరిగా పూజలు అందుకొంటున్నది. స్వామి రాతి విగ్రహానికి వెండికవచం కల్పించారు. సుబ్రమణ్యస్వామి శూలాయుధుడనటానికి విగ్రహం వద్ద శూలం ఉన్నది.. స్వామికి సర్పసూక్తం పఠనంతో పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆరుబయట పూజ విశేషం. సుబ్రమణ్యస్వామికి దేవసేనకు ఇక్కడ వివాహం జరిగిందని స్థానికుల అభిప్రాయం. పెద్ద వేపచెట్టుక్రింద పెక్కుమంది జరిపిన నాగప్రతిష్ఠకు సంకేతంగా నాగదేవతల విగ్రహాలు కొలువై ఉన్నాయి.
నైవేద్యం: స్వామికి నువ్వులు, బెల్లం దంచి రూపొందించిన చిమిలిని నైవేద్యంగా ఉంచుతారు. నైవేద్యమయిన చిమిలిని భక్తులకు పంచుతారు. వారు చిమిలిని మహాప్రసాదంగా స్వీకరిస్తారు.