శ్రీవేంకటేశ్వరుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెళ్లి చేసుకొన్న తర్వాత భార్యతో సహా తన నివాసమైన తిరుమలకు ప్రయాణమై దారిలో అగస్త్య మునిని సందర్శించుకొంటాడు. ముని స్వామికి అతిథి సత్కారాలు జరిపి, ఆరు నెలలపాటు అక్కడే ఉండమని కోరుతాడు. దీనికి కారణం కొత్త దంపతులు వివాహమయిన తర్వాత ఆరు నెలలపాటు ఏ కొండకూడా ఎక్కకూడదని ఆచరణలో ఉన్న నియమం. వెంకటేశ్వర స్వామి గడువు తర్వాత ప్రయాణమై భక్తులకు రెండు వరాలు ప్రసాదిస్తాడు. ఏ భక్తుడైనా తిరుమల చేరుకొనలేని పక్షంలో అతడు శ్రీనివాస మంగాపురంలోని తన ఆలయాన్ని సందర్శిస్తే అతడికి తిరుమలను సందర్శించిన పుణ్యం లభిస్తుంది. రెండవది- వివాహం కాని వారు ఇక్కడ జరిగే కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే అట్టివారికి చక్కటి భార్య/ భర్త లభించేలా వరం. తన వరంలో కళ్యాణం గురించి పేర్కొన్న కారణంగా కూడా స్వామి కళ్యాణ వేంకటేశ్వరుడుగా వెలిశాడని ప్రతీతి. ఈ ఆలయంలోని శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం తిరుమల ఆలయంలోని విగ్రహం కంటే ఎత్తయినది. మరింత ఆకర్షణీయమైనది. చారిత్రక ప్రాశస్త్యం : ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా వెల్లడి కాలేదు. అయితే 1324 సంవత్సరంలో సుల్తానుల పాలనలో ఆలయంపై దాడి జతిగినట్లు ఐతిహ్యం. ప్రముఖ వాగ్గేయజారుడు అన్నమయ్య మనుమడు తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుడు 16 వ శతాబ్దంలో ఆలయ పున:ప్రతిష్ట జరిపినట్లు శాసనాల ద్వారా తెలుసున్నది. 1967లో తిరుమల తిరుపతి దేవస్థానాల సంస్థ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకొని నిర్వహిస్తోంది.