విదియ - బాలా త్రిపురసుందరి - కట్టు పొంగలి (22-09-17) - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Saturday, 9 September 2017

విదియ - బాలా త్రిపురసుందరి - కట్టు పొంగలి (22-09-17)


విదియ - బాలా త్రిపురసుందరి - కట్టు పొంగలి (22-09-17)
"దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే -   హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే సకల జయకరీ, శక్తి బాలే నమస్తే|| "  అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి


"హ్రీంకారాసన గర్భితానల శిఖాం
సౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణా౦బర ధారిణీం వరసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాం
స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం
పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్"

శరన్నవరాత్రి ఉత్సవాలలో  రెండవ రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి."ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః"అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పొంగలి నివేదన చెయ్యాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి.

బాల గాయత్రి :  " ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి  - తన్నో బాలా ప్రచోదయాత్‌||" అనే బాల గాయత్రి సహస్ర గాయత్రి జపించిన మంచి ఫలితం లభిస్తుంది.

కట్టు పొంగలి

కట్టు పొంగలి కావలసిన పదార్థాలు:-- 
బియ్యం -- 2 కప్పులు 
పెసరపప్పు -- 1/2 కప్పు 
నెయ్యి -- 50 గ్రాములు 
మిరియాలు -- 2 స్పూన్స్
 జీలకర్ర -- 1 స్పూన్ 
అల్లం -- చిన్నముక్క 
ఇంగువ -- కొంచెంగా 
ఉప్పు -- తగినంత
 పసుపు -- చిటికెడు
 తయారీ విధానం:-- ముందుగా మిరియాలు & జీలకర్ర పొడిచేసి ఉంచుకోవాలి. ముందుగా బియ్యం & పెసరపప్పు కలిపి కడిగి తగినంత నీరు పోసి, అల్లంముక్క మెత్తగా దంచి వేయ్యాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడిగిన బియ్యం, పప్పుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి, దంచి ఉంచుకున్న మిరియాలు, జీలకర్ర పొడి, ఇంగువ వేసి వేగిన తరవాత, ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని, తగినంత ఉప్పు & పసుపు వేసి బాగా కలియబెట్లి దించుకోవాలి. ఇష్టమైనవారు ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చును. అంతే వేడి వేడి కట్టుపొంగలి రెడీ.