
కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని నందవరంలో వెలసిన చౌడేశ్వరీ దేవి వేలాది మందికి ఆరాధ్య దైవం. చౌడేశ్వరీ దేవీ రోజూ వారణాశి నుండి నందవరానికి వచ్చివెళ్లేదని ఐతిహ్యం.
ఒకప్పుడు చంద్రవంశం రాజు సోమేంద్రుడు నందవరాన్ని రాజధానిగా చేసుకొని పాలన సాగించేవాడు. అతను కొడుకు ఉత్తంగభుజుడు రాజైనాడు. అతడు 301 ఆలయాలు కట్టించినట్ల్తి ఐతిహ్యం. అతనికి ఒకనాడు శక్తి కలలో కనిపించి ‘నీ కుమారుడు నందుడు నందన చక్రవర్తి కాగలడని నుడివింది. దేవి చెప్పినట్లే అంతా జరిగింది. నండుడు జన్మించాడు. పెరిగి పెద్ద వాడై 16 వ ఏట యువరాజైనాడు. ఒకనాడు కొందరు భిల్లులు వచ్చి అడవులలో మృగాల బాధ ఎక్కువగా ఉన్నదని, తమకు, తమ పశువులకు రక్షణ లేదని విన్నవించారు. వెంటనే ఉత్తంగభుజుడు, నడుడు, రాణులతో సహా శ్రీశైలం అడవులలో వేటకై ప్రయాణం కట్టారు.
నందుడు వేటాడుతూ తపస్సు చేస్తున్న ఒక మునిని చూచి నమస్కరించాడు. ఆ ముని త్వరలో చక్రవర్తి కాగలవని నందుని ఆశీర్వదించి అంతర్దానమయ్యాడు. తర్వాత కొంతకాలానికి నందునికి వివాహమయింది. దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల అతనికి విచిత్రమైన పాదుకలు లభించాయి. ఈ పవిత్ర పాదుకలతో నందుడు రోజూ వారణాశికి వెళ్ళి గంగా స్నానం చేసివచ్చేవాడు. పాదుకల మహత్యం ఎవరికీ చెప్పకూడదని నియమం ఉన్నప్పటికీ నందుడు తన భార్య శశిరేఖను పాదుకల సహయంతో ఆమె చెప్పకుండా వారణాసికి తీసుకొని వెళ్ళి గంగాస్నానానికి ఉద్యుక్తుడవగా, భార్య తాను బహిష్ఠుతో ఉన్నానని ఐదు రోజుల పాటు గంగలో స్నానం చేయ జాలనని చెబుతుంది. ఆ విషయం తెలియక ఆమెను పుణ్యక్షేత్రానికి పిలుచుకొని వచ్చినందుకు నందుడు విచారం పొంది దోషనివారణకై పండితులకు భూరి దక్షిణలు ఇచ్చి పూజలు చేయిస్తాడు. భవిష్యత్తులో కూడా 500 మంది కాశీ పండితులకు సహాయం చేయగలని చాముండేశ్వరీ దేవి ఎదుట చెబుతాడు. పండితులు వివిధ పూజలు జరిపి దోషనివారణ కల్పిస్తారు.
కొన్ని సంవత్సరాల తర్వాత వారణాసిలో తీవ్రమైన కరువు సంభవించిది. కాశీ పండితులు నందవరానికి వెళ్లి నందుని సహాయం పొందాలని అనుకొంటారు. అందరూ వెళ్లడాని కంటే 14 మంది వెళ్ళి సహాయం గురించి వివరించాలని నిశ్చయించి రాజువద్దకు వచ్చారు. నందుడు తనకు కాశీ విషయం ఏమీ తెలియదని అపద్ధం చెబుతాడు. కాశీలో రాజు చాముండేశ్వరి ఎదుట హామీ ఇచ్చాడు కాబట్టి ఆ దేవతను రప్పించాలని ఒక పండితుడు సూచిస్తాడు. దీనితో నందునికి సంతోషం కలిగింది. దేవత నందవారానికి వస్తే తన పట్టణం పుణ్యక్షేత్రం కాగలదని భావించాడు. పండితులు పూజలు జరిపి దేవిని ఆహ్వానించారు. తాను చౌడేశ్వరిగా తేజోరూపంలో రాగలనని చెబుతుంది. దేవత విగ్రహ రూపంలో వచ్చి నందవరంలో నిలిచిపోయింది. తాను నందవరంలో నిలిచిపోతానని, ఆ 500 మంది కాశీ బ్రాహ్మణులు కూడ ఇక్కడే ఉంటారని నుడివింది. అప్పటి నుండి చౌడేశ్వరి నందవరంలో నిలిచి పూజలు అందుకొంటున్నది.