విశాఖకు వన్నె - సిద్ధివినాయక ఆలయం:- - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Thursday, 31 August 2017

విశాఖకు వన్నె - సిద్ధివినాయక ఆలయం:-


విశాఖకు వన్నె తెస్తున్న సిద్ధివినాయక ఆలయం:-
ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నానికి విశిష్టస్థానం ఉన్నది. ప్రాముఖ్యత సంతరించుకొన్న ఓడ రేవు, విశ్వవిద్యాలయం, స్టీల్ ఫాక్టరీ, ప్రముఖ దేవాలయాలు, ఇంకా ఎన్నెన్నో విశాఖకు వన్నె తెచ్చాయి. 60 వ దశకం ఉత్తరార్ధంలో (1967-68) విశాఖలో ఉక్కు ఫాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు సమ్మె చేయడం వల్ల సుదూర ప్రాంతాలలోని గ్రామాల వారికి కూడా ఈ నగరం గురించి తెలియ వచ్చింది. దశాబ్దాల క్రితం " సింహాచలము మహా పుణ్యక్షేత్రము" అనే సినిమా పాట కారణంగా సింహాచలం, విశాఖపట్నం పేర్లు వేలాదిమంది నాలుకలపై నాట్యం చేశాయి.
ఇలా విశిష్టత సంతరించుకొన్న విశాఖపట్నంలో పెక్కు దేవాలయాలు ఉన్నాయి.
వాటిలో సిద్ధి వినాయకుని ఆలయం చెప్పుకోదగ్గది. ఈ ఆలయం శ్రీ సిద్ధి వినాయక, పార్వతీ ముక్తేశ్వర స్వామి ఆలయంగా పేరుప్రతిష్టలు ఆర్జించింది. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా మందిరం, జ్యోత్రిర్లింగాల ప్రతిరూపాలు, కాలభైరవుడు, ఆంజనేయస్వామికి ఆలయాలు వెలిశాయి. సుమారు 35 సంవత్సరాల క్రితం స్థానిక ఎంవిపి కాలనీలో ఈ ఆలయం ప్రతిష్ట జరిగింది. జ్యోతిర్లింగాలకు కూడా గర్భగుడుల నిర్మాణం జరిగింది.
విశాఖలోని ఈ ఆలయంలో వెలసిన ముక్తేశ్వరుడు ముక్తి ప్రదాతగా పేరుపొందాడు. ఇహపరాల గురించి ఆలోచించేవారికి కొంగుబంగారంగా పేరుపొందిన దైవం ముక్తేశ్వరుడు. స్వామితో పాటు ఇక్కడ దేవేరి పార్వతి. ఆమె ముద్దులపట్టి గణేశుడు సిద్ధి వినాయకుడుగా పూజలందుకొంటున్నారు. శివుని పరమ భక్తుడు, అంగరక్షకుడు అయిన కాలభైరవుడు కోర్కెలు తీర్చేవాడుగా పేరుపొందాడు, ఆదిశంకరుడు రచించిన 'కాశికాపురాధినాథ కాలభైరవం భజే' అనే అష్టకం గురించి తెలసిన వారు కాలభైరవుని పూజిస్తారు. పెక్కు దేవతలు కొలవైన ఈ ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలుగుతున్నది.
ఆలయానికి సంబంధించిన వివరాలకు: శ్రీసిద్ధి వినాయక, పార్వతీ ముక్తేశ్వర సమేత శ్రీ సద్గురు సాయిబాబా మందిరం, సెక్టర్ 6, ఎం వి పి కాలనీ, విశాఖపట్నం - 530017, ఫోన్: 91 98489 50823