శివాలయంలో ద్వారపాలకులుగా ప్రమద గణాల విగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ, భైరవకోనలోని రుద్రాలయానికి బ్రహ్మ, విష్ణువులు ద్వారపాలకులు. ప్రకాశం జిల్లా సీయస్ పురం మండలం అంబవరం-కొత్తపల్లి గ్రామ సమీపంలో ఉంటుంది భైరవకోన. ఒకే గుహను తొలిచి నిర్మించిన ఎనిమిది ఆలయాలు అద్భుతాన్ని కలిగిస్తాయి. ప్రధాన శివాలయం ద్వారపాలకులుగా బ్రహ్మ, విష్ణువుల విగ్రహాలు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పైగా, సాధారణంగా నాలుగు భుజాలతో అంతటా కనిపించే విష్ణుమూర్తి విగ్రహం.. ఇక్కడ ఎనిమిది భుజాలతో దర్శనమిస్తుంది. ఇక్కడి దుర్గాదేవి ఆలయంలో ముగ్గురమ్మల ముఖాలతో వెలసిన మూలపుటమ్మ విగ్రహం ఉంటుంది. లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ దేవి రూపాలు కలిసి ఉండటం చాలా అరుదు. కుడివైపు, ఎడమవైపు తొండం ఉన్న వినాయక విగ్రహాలు ఇక్కడ మరో ఆకర్షణ.
మరిన్ని వింతలు
క్రీస్తుశకం ఆరో శతాబ్దంలో మలచిన ఈ గుహలు.. అపురూప శిల్పసంపదతో అలరారుతున్నాయి. ఆలయాల సమీపంలో ఉన్న జలపాతం మనోహరంగా ఉంటుంది. ఈ జలపాతం నీళ్లు త్రిముఖ దుర్గాదేవి విగ్రహం ముందు ప్రవహించి వెళ్తూ ఒక గుండాన్ని ఏర్పరిచాయి. ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఈ గుండంపై ప్రసరించిన చంద్రకిరణాలు దుర్గాదేవి ముఖంపై ప్రతిఫలించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ క్షేత్రంలో కాకులు కనిపించకపోవడం మరో విశేషం.
ఎలా వెళ్లాలంటే..
ఒంగోలు నుంచి భైరవకోన 124 కిలోమీటర్లు. ఒంగోలు నుంచి పామూరుకు వెళ్లి, సీయస్ పురం మీదుగా భైరవకోన చేరుకోవచ్చు. కనిగిరి నుంచి 61 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీయస్ పురం నుంచి భైరవకోనకు ఆటోలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. దేవాదాయ శాఖ వారి ఉచిత భోజన సౌకర్యం ఉంది.