కర్నాటకలోని పుణ్యక్షేత్రాలలో ఉడుపి పవిత్రకకు ప్రతీకగా నిలుస్తున్నది. మిగతా ఆలయాలు పుణ్యక్షేత్రాలు కాగా ఉడుపి మతపరమైన తత్వానికి పెట్టిన పేరు. త్రిమతస్థ బ్రాహ్మణ సంప్రదాయాలలో ఉడుపి మధ్వ (ద్వైత సిద్ధాంతం) సంప్రదాయాన్ని వెల్లడిస్తున్నది. అయితే ఉడుపి ఆలయం మధ్వ సిద్ధాంతాన్ని పాటించేవారికి మాత్రమే పరిమితం కాలేదు. కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల వారు కూడా ఆలయాన్ని దర్శిస్తున్నారు.
రామభోజుడనే రాజు పరశురామునికి శిష్యుడు. అతడు ఇక్కడ అనంతేశ్వర, చంద్రేశ్వర ఆలయాలని నిర్మించాడు. చంద్రుడు ఇక్కడ తపస్సు చేసినట్లు ఐతిహ్యం. దీనితీ చంద్రేశ్వర ఆలయ నిర్మాణం జరిగింది.
ఉడుపిని సందర్శించే భక్తులు మొదట అనంతేశ్వరం, చంద్రేశ్వర ఆలయాలను సందర్శించి, తర్వాత కృష్ణ ఆలయాన్ని దర్శిస్తారు.
ఒక నావికుడు ద్వారక నుండి తన సరుకుతోపాటు శ్రీగంధంతో చేసిన కృష్ణ విగ్రహాన్ని ఒక పడవలో తరలిస్తుందగా ఉడుపి సమీపళోని మల్పె తీరంలో తుపానుకు గురై మునిగి పోతుండగా తీరంలో ఉన్న మధ్వాచార్యులు తన అంతర్దృష్టితో దీనిని వీక్షించి తన కాషాయ వస్త్రాన్ని ఊపి వర్షాన్ని నిలిపి పడవను కాపాడారని, అందుకు ప్రతిఫలంగా ఏమివ్వగలనని నావికుడు కోరగా పడవలోని విగ్రహాన్ని ఇమ్మనగా అతడు ఆచార్యులకు విగ్రహాన్ని ఇస్తాడు. స్వామి విగ్రహానికి తగురీతిలో ప్రోక్షణలు జరిపి ఉడుపి ఆలయంలో ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం.
16 వ శతాబ్దంలో వాదిరాజు రాజుగా ఉన్నప్పుడు కనకదాసు అనే కృష్ణ భక్తుడు ఉడుపి ఆలయాన్ని సందర్శించడానికి రాగా నిమ్నజాతికి చెందినవాడనే కారణంగా అతనికి ఆలయ ప్రవేశం లభించలేదు. అప్పుడు కనకదాసు భక్తిపారవశ్యంతో శ్రీకృష్ణగానం జరపగా దేవుడు గోడకు రంధ్రం చేసి ఆ రంధ్రం గుండా కనకదాసునికి దర్శనం ఇచ్చాడు. ఆ రంధ్రం కనకన కిండి పేరుతో వ్యాప్తిలోకి వచ్చింది.